పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ 3 పనులు ముందుకు!

పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ 3 పనులు ముందుకు!
  • రివైజ్డ్​ అంచనాలపై కేబినెట్​లోచర్చించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీ 3 పనులను పూర్తి చేసేందుకు సర్కారు నిర్ణయించింది. ప్యాకేజీలోని నార్లాపూర్​ రిజర్వాయర్​ నుంచి ఏదుల రిజర్వాయర్​ వరకు చేపట్టిన ప్రధాన కాల్వ తవ్వకం ఆగిపోయింది. మొత్తం 8.32 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పనుల్లో భాగంగా ఇప్పటిదాకా 4.3 కిలోమీటర్ల మేర పనులు పూర్తికాగా.. 3.5 కిలోమీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టాల్సి ఉంది. మధ్యలో పెద్ద బండరాళ్లు అడ్డుపడడంతో తవ్వకం పనులు ఆగిపోయాయి. కొద్ది వరకు కంట్రోల్​ బ్లాస్ట్  విధానంలో బండరాళ్లను తొలగించే పనులు చేపట్టారు.

కాల్వ మట్టి తవ్వకం, లైనింగ్​ కోసం రూ.250 కోట్లు కాగా.. బండ రాయిని తొలగించేందుకు రూ.450 కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బండరాయి తొలగింపునకు సంబంధించి రివైజ్డ్​ అంచనాలతో రూ.వంద కోట్లకు ప్రతిపాదించారు. దానికి సంబంధించిన ఫైల్​పై శనివారం జరిగే కేబినెట్​లో చర్చించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి వద్ద చర్చించినట్టు తెలిసింది. ఉన్న టెండర్​ను అలాగే కొనసాగిస్తూ.. రివైజ్డ్​ అంచనాలను రూపొందించినట్టు తెలిసింది.

తొలుత టెండర్​ను రద్దు చేయడమా లేదంటే ఇప్పుడున్న టెండర్​ను కొనసాగించి రివైజ్డ్​ అంచనాలను రూపొందించడమా అన్న దానిపై డైలమాలో ఉన్న అధికారులు.. ఇప్పుడున్న టెండర్​నే కొనసాగించేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఈ పనులను పీఎస్​కే, కేఎన్​ఆర్, జీవీఆర్ సంస్థలు జాయింట్​ వెంచర్​ ద్వారా చేస్తున్నాయి.